కాకతీయ ప్రీమియర్ లీగ్ ఆరంభం
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు వరంగల్ వేదిక
25 రోజుల పాటు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు
గెలుపు అహంకారం ఓటమికి దారి తీస్తుంది : మంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ సిటీ : తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన కాకతీయ ప్రీమియర్ లీగ్ (కెపిఎల్) సీజన్–16 గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ క్లాసిక్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీని ఆవిష్కరించి తొలి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… జీవితంలో బాధ్యతలు, ఒత్తిడులు ఎంత ఉన్నా క్రీడలు ఆడటం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. క్రీడలు ఫిజికల్ ఎక్సర్సైజ్‌లుగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

మైదానంలో పోటీ… బయట స్నేహం
పోటీతత్వం మైదానంలో ఉన్నంతవరకే పరిమితం కావాలని, మైదానం వీడిన తర్వాత ప్రత్యర్థులు కాదు… స్నేహితులుగా మెలగాలని మంత్రి సూచించారు. ఒకరికి తెలిసిన నైపుణ్యాలను తెలియని వారికి చెప్పుకోవాలని, మనకు తెలియనివి తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలని క్రీడాకారులకు హితవు పలికారు. గెలిచామని ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోతే ముందుముందు ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని మంత్రి హెచ్చరించారు. క్రమశిక్షణ, నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
32 జట్లు… 25 రోజుల మ్యాచ్‌లు
క్లాసిక్ క్రికెట్ క్లబ్ చైర్మన్ మిర్జా ఇనాయత్ (అత్తర్) మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన జట్లలో 32 జట్లను ఎంపిక చేసి, వాటిని 8 పూల్స్‌గా విభజించి 25 రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.70 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.15 వేలు, చతుర్థ బహుమతి రూ.10 వేలు అందజేస్తామని వెల్లడించారు.

రిపబ్లిక్ డే ఫైనల్‌లో మార్పు
ఆర్గనైజర్ అరబాక నాగరాజు మాట్లాడుతూ… సాధారణంగా జనవరి 26న ఫైనల్ నిర్వహించే ఆనవాయితీ ఉన్నప్పటికీ, ఈ ఏడాది మేడారం జాతర ముందుగా రావడంతో టోర్నమెంట్‌ను ముందే ముగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ ఏసీపీ శుభం ప్రకాష్‌తో పాటు ఆర్గనైజర్లు మంద తిలక్, కాశి, అరబాక నాగరాజు, వినయ్, అజ్జు, అజమాత్, గజ్జల నాగరాజు, మిట్టపల్లి నాగరాజు, అఖిల్, సాయిరాం, ప్రశాంత్, ఆకాంక్ష, శ్రీకాంత్, శ్రవణ్ తదితరులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


