కాకతీయ ఎఫెక్ట్..!
మేడారంలో పోలీస్ ‘రెడ్ కార్పెట్’కు చెక్
గద్దెల వద్ద ప్రత్యేక సౌకర్యాలపై దుమారం
కాకతీయ కథనంతో ఉన్నతాధికారుల ఆరా
గద్దెల వద్ద ఓవర్ చేసిన అధికారికి క్లాస్?
భక్తులందరికీ సమాన దర్శనంపై ఆదేశాలు

కాకతీయ, ములుగు ప్రతినిధి : శుక్రవారం మేడారం సమ్మక్క–సారమ్మ మహాజాతరకు పది లక్షల మందికి పైగా భక్తులు తరలిరావడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల భద్రత, గద్దెల వద్ద క్రమశిక్షణ కోసం ఇనుప కంచెలు ఏర్పాటు చేసి, కంచె అవతల నుంచే దర్శనానికి అనుమతించారు. అయితే ఇదే సమయంలో కొందరు పోలీసు అధికారులు తమ కుటుంబ సభ్యులను నేరుగా సమ్మక్క–సారమ్మల గద్దెల వద్దకు తీసుకువెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి, ఇనుప కంచె అవతల నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంటే, పోలీసు అధికారుల బంధువులకు మాత్రం ప్రత్యేక సౌకర్యాలు కల్పించడమేంటని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మేడారంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కథనంతో కదిలిన ఉన్నతాధికారులు
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కాకతీయ దినపత్రికలో “మేడారంలో పోలీస్ రెడ్ కార్పెట్” అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. కథనం వెలువడిన వెంటనే ములుగు జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. గద్దెల వద్ద వ్యవహారంపై ఆరా తీసిన ఉన్నతాధికారి, నిబంధనలు అతిక్రమించిన సంబంధిత అధికారులను పిలిపించి తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. గద్దెల వద్ద ఓవర్ చేసిన ఓ మహిళా అధికారికి కూడా క్లాస్ ఇచ్చినట్టు సమాచారం. ఇకపై గద్దెల వద్దకు ఎవరినీ అనుమతించకూడదని, కేవలం అధికారికంగా అనుమతి పొందిన వీఐపీ, వీవీఐపీ లకే దర్శనానికి అవకాశం కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సాధారణ ప్రజలైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, పోలీసు అధికారుల బంధువులైనా—ఎవరినీ ప్రత్యేకంగా గద్దెల వద్దకు తీసుకువెళ్లరాదని తేల్చిచెప్పారు. భక్తులందరికీ సమానంగా దర్శనం కల్పించడమే ప్రభుత్వ, పోలీసు శాఖల ప్రధాన బాధ్యతని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో భక్తుల్లో కొంతవరకు సంతృప్తి వ్యక్తమవుతోంది.


