కాకతీయ, వరంగల్ బ్యూరో : కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు ..? అంటూ రఘునాథపల్లి మండలం భారత రాష్ట్ర సమితి నాయకులు కొత్త ఆలోచనతో పోస్టర్లను అతికించారు. జనగామ జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీఆర్‌ఎస్ నేతలు రఘునాథపల్లి లో అతికించిన పోస్టర్లు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.
కడియంపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు..
కడియం గారు నీ రాజీనామా ఎప్పుడు..? అంటూ ప్రారంభమైన పోస్టర్లలో విద్యావేత్త, నీతి – నిజా యితీకి మారుపేరుగా చెప్పుకుంటున్న కడియం స్టేషన్ ఘన్పూర్ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన పదవికి నిజంగా మీరు ఉమ్మడి వరంగల్ సీనియర్ నాయకులు అయితే భారత రాజ్యాంగం పట్ల న్యాయస్థానాలు & స్పీకర్ ఆధేశాల పట్ల మీకు ఏ మాత్రం గౌరవం ఉన్న తక్షణమే మీ పదవికి రాజీనామ చేసి, మీ నిజాయితిని ప్రజాక్షేత్రంలో నిరుపించుకోగలరు అని ఉన్న పోస్టర్లు ఇప్పుడు జనగామ జిల్లాలో కలకలం రేపుతుంది. బీఆర్‌ఎస్ స్థానిక నేతలు కడియం శ్రీహరి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా నిలబడటానికి తాము చేసిన కృషినే కారణమని స్పష్టం చేశారు. తాము రాత్రింబవళ్ళు కష్టపడి పోరాడక పోతే కడియం కి పదవి దక్కేదే కాదని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ మార్పు గురించి ఆలోచించడం అనైతికమని, వెంటనే పదవి నుంచి రాజీనామా చేయాలని స్పష్టమైన డిమాండ్ చేశారు.
కడియం వర్గీయుల ప్రతిస్పందన..
దీనిపై కడియం వర్గం మాత్రం భిన్నంగా స్పందించింది. కడియం శ్రీహరి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ప్రజాసేవే ధ్యేయంగా కొనసాగారు. ఆయనకు వచ్చిన పదవులు ఆయన విద్యా నేపథ్యం, కృషి, నైపుణ్యం వల్లే సాధ్యమయ్యాయి. పార్టీ మార్పు చేయాలా వద్దా అనేది ఆయన స్వతంత్ర నిర్ణయం. దానికి బలవంతంగా రాజీనామా చేయమని చెప్పడం సరైంది కాదు అని వర్గీయులు వాదిస్తున్నారు.
కడియం – రాజయ్య మధ్య పాత విభేదాలు..
జనగామ జిల్లాలో కడియం శ్రీహరి – రాజయ్య మధ్య విభేదాలు కొత్తవి కావు. బీఆర్‌ఎస్ పాలనలోనే ఈ ఇద్దరి మధ్య శక్తి పోరు బహిరంగంగానే సాగింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు స్థానికంగా వర్గ పోరాటానికి దారి తీసాయి. ఇప్పుడు కడియం నిర్ణయం నేపథ్యంలో ఆ విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చి, ఇరు వర్గాల అనుచరులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
పోస్టర్లతో పెరిగిన రాజకీయ వేడి..
రఘునాథపల్లిలో అతికించిన ఈ పోస్టర్లు కేవలం స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయి. పోస్టర్లలో కడియం శ్రీహరి గతంలో పొందిన గౌరవాలు, పదవులు గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనా అనే సందేహం రేకెత్తించారు. కడియం శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జనగామ రాజకీయాల్లో పెద్ద మార్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన బీఆర్‌ఎస్ లోనే కొనసాగితే రాజయ్య వర్గంతో సమరశీల పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, పార్టీ మారితే స్థానిక సమీకరణాలు పూర్తిగా మారిపోయి, రాబోయే ఎన్నికల్లో అనూహ్య ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భవిష్యత్తు ఏంటి..?
ప్రస్తుతం కడియం శ్రీహరి మౌనం పాటిస్తున్నా, ఆయన తదుపరి అడుగు ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో పెరుగుతోంది. రాజీనామా చేసి కొత్త దిశలో ప్రయాణిస్తారా.? లేక బీఆర్‌ఎస్ లోనే కొనసాగుతారా.? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలోనే తేలనుంది.


