- కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను ప్రజలు గమనించాలి
- ఎంఐఎంతో రెండు పార్టీలు బేరసారాలు
- కేంద్ర మంత్రి బండి సంజయ్
- అట్టహాసంగా బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి నామినేషన్
- హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాంచందర్‌రావు
- పెద్ద సంభ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లిహిల్స్ నియోజకవర్గం కిషన్ రెడ్డి అడ్డా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి జూబ్లిహిల్స్ ను అభివృద్ధి చేస్తారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే అని.. రెండు పార్టీలు కలిసి దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల పాలనలో జూబ్లిహిల్స్ ప్రజలకు ఒరిగిందేంలేదన్నారు. బీజేపీని ఓడించేందుకు దేశమంతా పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీ.. జూబ్లిహిల్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదని సంజయ్ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలతో ఎంఐఎం చేసుకున్న బేరసారాలే నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి స్థలాన్ని మజ్లిస్ కు ధారాదత్తం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పై కోపంతో బీఆర్ఎస్ కు ఓట్లేస్తే ఇక అంతే సంగతులన్నారు. బీజేపీని గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

బీజేపీతోనే అభివృద్ధి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ – మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వారు పోటీలో ఉన్నట్లు నటించడమే తప్ప, వాస్తవానికి ప్రజల్లో లేరన్నారు. నగరంలోని కాలనీల్లో డ్రైనేజ్ వాసనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ప్రతి రోజు మురుగు నీటి సమస్యలతో బాధపడుతున్నా, ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ప్రత్యక్ష ఉదహరణ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గతంలో ఏ ప్రభుత్వమూ అభివృద్ధి, పథకాల అమలులో సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ముఖ్యంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
అభివృద్ధి, ప్రజల నమ్మకానికి, పారదర్శక పాలనకు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పురోగతి, శాంతి స్థిరత్వం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. “జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధికి ఓటు వేయబోతున్నారు. దీపక్ రెడ్డి విజయం తథ్యం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
నేతల ప్రత్యేక పూజలు
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఇవాల నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఉదయం వెంకటగిరి హైలంకాలనీలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, హైలంకాలనీ నుంచి నామినేషన్ ర్యాలీకి ఘనంగా ఆరంభమైంది. డప్పు నృత్యాలతో ఈ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపక్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అనంతరం షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బండి సంజయ్ దీపక్‌రెడ్డికి మద్దతు ప్రకటించి మాట్లాడారు.


