జమ్మికుంటలో జెపీఎల్ సీజన్-3 ప్రారంభం
యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి
మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో జమ్మికుంట ప్రీమియం లీగ్ (జెపీఎల్) సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్ను మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, క్రీడాకారులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఛైర్మన్ ప్రశాంత్ కుమార్ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంచుతాయని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించాలని, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలని సూచించారు.
ఇలాంటి టోర్నమెంట్లు స్థానిక ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అన్ని జట్లు క్రీడాస్ఫూర్తితో పోటీ పడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్ దిడ్డి కోమల, దిడ్డి రాము, మాచెర్ల రాజు, కందాల రాము, శ్రీనివాస్, రాము, క్రీడాభిమానులు, యువత పాల్గొన్నారు.


