డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం!
తేలనున్న పెండింగ్ సీఎంఆర్ లెక్క
90 రోజుల గడువుతో మిల్లర్లకు అల్టిమేటం
సీఏంఆర్ బకాయిల రికవరీపై ఫుల్ ఫోకస్
కాకతీయ కథనాలతో కదులుతున్న యంత్రాంగం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : డిఫాల్ట్ రైస్ మిల్లర్ల పెండింగ్ సీఏంఆర్ బకాయిల రికవరీకి సివిల్ సప్లయ్ శాఖ గట్టిగా నడుం బిగించింది. పేదల బియ్యం మాయం, కరీంనగర్ జిల్లాలో సీఏంఆర్ స్కామ్ అంటూ ఇటీవల వెలువడిన కథనాలతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా యాక్టివ్ అయ్యింది. ఇప్పటివరకు నామమాత్రంగా సాగిన చర్యలకు బ్రేక్ వేస్తూ, తాజాగా జారీ చేసిన జీవోను ఆయుధంగా మార్చుకుని డిఫాల్ట్ మిల్లర్లపై దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్, జిల్లా అధికారులు సమన్వయంతో రికవరీ డ్రైవ్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో 2012–13 నుంచి 2023–24 వరకు ప్రభుత్వానికి అందాల్సిన సీఏంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) బియ్యం భారీగా పెండింగ్‌లోనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 35,563 మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్‌గా నమోదై ఉండగా, ప్రస్తుత ధరల ప్రకారం దాని విలువ రూ.137 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంతకాలం డిఫాల్ట్‌లు కొనసాగినా కఠిన చర్యలు లేకపోవడం వెనుక అధికారుల అండదండలున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా జీవో అమలు నిజంగా రికవరీకి దారి తీస్తుందా? లేక మరోసారి కాగితాలకే పరిమితమవుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.
సీఏంఆర్ బకాయిలపై జీవో కొరడా
సీఏంఆర్ బకాయిల నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & సివిల్ సప్లయ్ శాఖ 24-11-2025న మెమో నెం.2809 / సీఎస్.ఐ–సీసీఎస్ / 2025ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం కేఎంఎస్ 2014–15 నుంచి 2023–24 వరకు డిఫాల్ట్ అయిన మిల్లర్లు అసలు సీఏంఆర్ మొత్తంతో పాటు 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ కలిపి మొత్తం 125 శాతం విలువ చెల్లించాలి. నగదు గానీ, సన్నబియ్యం రూపంలో గానీ బకాయిలు తీర్చేందుకు కేవలం 90 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. ఈ గడువులోపే పూర్తి చెల్లింపులు చేసిన మిల్లర్లకే భవిష్యత్తులో తాజా వరి అలాట్ చేయాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. జీవో అమలులో భాగంగా జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ఆధ్వర్యంలో డిఫాల్ట్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు 22 మంది డిఫాల్ట్ మిల్లర్లను పిలిచినా, అర్ధహాజరే కనిపించడంతో అధికారుల్లో అసహనం వ్యక్తమైంది. జీవో నిబంధనలపై కౌన్సిలింగ్ ఇచ్చినా, మిల్లర్ల నిర్లక్ష్య ధోరణి అధికారులను మరింత అప్రమత్తం చేసినట్లు సమాచారం.
కఠిన చర్యల వైపు జిల్లా యంత్రాంగం
ఈసారి బకాయిల రికవరీలో వెనుకడుగు లేదన్న సంకేతాలు జిల్లా యంత్రాంగం నుంచి వస్తున్నాయి. డిఫాల్ట్ మిల్లర్లతో మరో కీలక సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హాజరు కాకపోతే లైసెన్సుల రద్దు, ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 19 రైస్ మిల్లులు డిఫాల్ట్‌గా ఉండగా, అధికారికంగా 22 డిఫాల్ట్ ఎంట్రీలు నమోదయ్యాయి. కొన్ని మిల్లులు పునరావృతంగా బకాయిలు పెంచుకుంటుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికైనా జీవో అమలుతో పేదల బియ్యం ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయా? డిఫాల్ట్ మిల్లర్లపై నిజంగా చర్యలు పడతాయా? అన్నది రాబోయే 90 రోజుల్లో తేలనుంది. తదుపరి చర్యలపై జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.


