మెడికల్ సీట్లలో జీవో 33 అమలు చేయాలి
నీట్ అభ్యర్థుల తల్లిదండ్రుల డిమాండ్
ఏకశిల పార్కు లో నిరసన
కాకతీయ, హనుమకొండ : మెడికల్ సీట్ల అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు హనుమకొండ లో నిరసన చేపట్టారు. ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం (ఏకశిల పార్కు)లో ప్లకార్డులతో నిలబడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణాచారి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో చదవకపోయినా తప్పుడు స్టడీ సర్టిఫికేట్లు సమర్పించి మెడికల్ సీట్లు పొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జీవో 33 తీసుకువచ్చినా, దానిని అమలు చేయకపోవడంతో స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. నీట్–యూజీ–2024 కౌన్సెలింగ్‌లో కోర్టుకు వెళ్లిన 135 మందిలో 86 మందిని లోకల్‌గా పరిగణించారని, వారిలో 56 మంది తెలంగాణకు సంబంధంలేనివారని తెలిపారు. విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడంలేదని, స్థానిక విద్యార్థుల హక్కులను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్నవారు.. బి.అంజయ్య, ఆర్.మధు, మహేష్, భరత్, ఆర్.నరేందర్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రెడ్డి, జి.అనిల్‌కుమార్, జి.ప్రసాద్‌చారి, వీటీవీ రామారావు, ఎన్.విష్ణు, టి.ఉమేష్‌కుమార్, ఎస్.భాస్కర్‌రావు, ఈ.కృష్ణకుమార్, టి.రాంప్రసాద్, జీఎస్.హనుమంతరావు, ఈ.ఓంప్రకాశ్, బి.హరీందర్, డి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.


