కాకతీయ, నేషనల్ డెస్క్: మావోయిస్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లా అడవుల్లో బుధవారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 8 గంటల సమయంలో బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఆపరేషన్‌లో జార్ఖండ్ జాగ్వార్స్, గుమ్లా పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా పాల్గొన్నారు. నిషేధిత జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (JJMP) మావోయిస్టులు లక్ష్యంగా ఉండగా, జరిగిన కాల్పుల్లో ముగ్గురు సభ్యులు అక్కడికక్కడే మరణించారు.
ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇంకా అటవీ ప్రాంతంలో మిగిలిన మావోయిస్టుల కోసం సోదాలు కొనసాగిస్తున్నారు.
ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులపై భద్రతా దళాల దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్)కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు మరణించారు. వీరిని రాజు దాదా అలియాస్ కట్టా రామచంద్రారెడ్డి (63), కోసా దాదా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి (67)గా గుర్తించారు. ఇద్దరూ కేంద్ర కమిటీ సభ్యులే కాకుండా, ఒక్కొక్కరిపై రూ.1.80 కోట్ల బహుమతి ఉంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సీనియర్ మావోయిస్టులు అనేక హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. వీరి దాడుల్లో పోలీసులు సిబ్బందితోపాటు అనేక మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ మాట్లాడుతూ, మావోయిస్టులు ఇటీవలి కాలంలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని, సంస్థ ఇప్పుడు నాయకత్వం లేకుండా బలహీన స్థితిలో ఉందని పేర్కొన్నారు.


