చేప పిల్లల పంపిణీపై ముఖ్యమంత్రికి జీవన్ రెడ్డి లేఖ
మత్స్యకారుల ప్రయోజనాలపై కీలక సూచనలు
చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ అవసరం
టెండర్ల జాప్యంతో అమలు లోపాలు వెలుగులోకి
సహకార సంఘాల ఏర్పాటుకు ప్రత్యేక డ్రైవ్ సూచన
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితులు, చేప పిల్లల పంపిణీ విధానంపై మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ విధానం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని పేర్కొంటూ చెరువులు, కుంటల విస్తీర్ణానికి అనుగుణంగా మత్స్యకార సహకార సంఘాలకు నగదు బదిలీ అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో చేపల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, ముదిరాజ్ మత్స్యకారులకు సకాలంలో చేప విత్తనం అందకపోవడం, పంపిణీ చేసే చేప పిల్లల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల చేపల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగడం లేదని ఆయన లేఖలో వివరించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యాలు పూర్తిగా నెరవేరకపోవడంతో పాటు మత్స్యకారులు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్న పరిస్థితి నెలకొందని ఆ లేఖలో పేర్కొన్నారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తికావాల్సిన చేప పిల్లల పంపిణీ టెండర్ల నిర్వహణలో జాప్యం కారణంగా ఆలస్యమవుతోందని, జగిత్యాల జిల్లాలో మొత్తం 756 చెరువులు ఉండగా ఇప్పటివరకు కేవలం 154 చెరువులకు మాత్రమే చేప పిల్లల పంపిణీ జరగడం అమలు లోపాలకు నిదర్శనమని పేర్కొన్నారు. చేప విత్తనం అందని మత్స్యకార సహకార సంఘాలకు చెరువుల ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని నగదు బదిలీ చేపట్టడం అవసరమని సూచించారు. మత్స్యకార సహకార సంఘాలు స్వయంగా చేప విత్తనం కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో పోసి పెంచుకునేలా నగదు బదిలీ అమలు చేస్తే మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అలాగే చేపల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, ముదిరాజులకు సహకార సంఘాలు లేని గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టాలని కోరారు. మత్స్యకారుల జీవనోపాధి పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిని లేఖలో విజ్ఞప్తి చేశారు.


