- కేసీఆర్ ఫొటో పెట్టుకోవడం నైతికం కాదు
- తెలంగాణ తల్లి, జయశంకర్ సార్ ఫోటోలతో జనంలోకి..
- ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రతీ జిల్లాలో 2 రోజులపాటు యాత్ర
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
- జాగృతి జనంబాట యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కవిత.. తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించారు. ఈక్రమంలోనే ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి జనంబాట యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. త్వరలోనే తాను చేపట్టనున్న ప్రజాయాత్రకు సంబంధించిన పలు వివరాలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తన భవిష్యత్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కడుపున పుట్టడం అదృష్టం
కేసీఆర్ గురించి మాట్లాడిన కవిత.. ఒక పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు అని.. ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని.. అందుకే ఆయన ఫోటో పెట్టుకుని యాత్ర చేయడం నైతికంగా సరైంది కాదని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ ఫోటో కాకుండా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలతో ఈ జాగృతి జనం బాట యాత్ర కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తన తండ్రి అని.. ఆయన కడుపున పుట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. అదే సమయంలో కేసీఆర్ ఫోటోను యాత్రలో ఉంచడం తన నైతిక విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీన ప్రారంభం కానున్న ఈ యాత్ర.. ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
ప్రజలే గురువులు..
సామాజిక తెలంగాణ కోసం తాను అప్పుడు పోరాడానని.. ఇప్పుడు కూడా పోరాడతానని స్పష్టం చేశారు. ప్రజలే తన గురువులని.. అందుకే ప్రజల దగ్గరికి వెళ్లాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు కవిత వివరించారు. హైదరాబాద్‌లో కూర్చొని జిల్లాల్లో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడటం సరైంది కాదని.. అందుకే ప్రతీ జిల్లాలో జాగృతి జనం బాట పేరుతో 2 రోజులపాటు యాత్ర చేస్తానని తెలిపారు. నాలుగు నెలలపాటు ఈ జాగృతి జనం బాట యాత్ర కొనసాగుతుందని కవిత వివరించారు. యాత్రలో అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు చాలా తెలివైన వాళ్లని.. వారికి అన్నీ తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ యువత, మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సానుకూలంగా లేదని విమర్శలు చేశారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి.. ప్రతిపక్షాలను వేధించే పనిలోనే ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని కవిత ఆరోపించారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అనిశ్చితి వాతావరణం నెలకొందని మండిపడ్డారు.


