జనసేన సభ్యత్వ నమోదు వేగవంతం
రూ.5 లక్షల భీమా సౌకర్యం..
కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి తెలంగాణలోనే కరీంనగర్‌ను అగ్రస్థానంలో నిలుపుతామని పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. కరీంనగర్ శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి రూ.2 కోట్ల విరాళం అందించడంతో పాటు తొలి సభ్యత్వాన్ని స్వయంగా తీసుకున్నారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే వారిని “ఉద్యమి”, సభ్యత్వ నమోదు ప్రోత్సహించే వారిని “సాధక్”, పార్టీ బలోపేతానికి సహకరించే వారిని “ప్రదాత”గా పిలుస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఉద్యోగులు, యూనియన్ సభ్యులు, కుల సంఘాలు, చిన్న వ్యాపారులు, కూలీలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటమే జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ నగరంలో కళాభారతి సమీపంలోని ఈద్గా గోడ వాహనదారులకు అడ్డంకిగా మారిందని, ప్రమాదాలను నివారించేందుకు వెంటనే తొలగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల అగ్రనేతల అంతర్గత ఒప్పందాలను ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు. తనను సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్‌గా నియమించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా రాష్ట్ర నాయకత్వానికి బేతి మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


