జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది
కాంగ్రెస్, బీజేపీతో ప్రజలు విసిగిపోయారు
బీహార్ ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ జోస్యం..
ప్రధాన పార్టీల్లో పెరిగిన టెన్షన్!
కాకతీయ, జాతీయం : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ అంచనాలు తలకిందులు చేసింది. ప్రజలు ఊహించని స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 64.66% పోలింగ్ నమోదైంది. ఈ గణాంకాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 1951లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత ఇంత భారీ ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి. జన్ సురాజ్ పార్టీ అధినేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ రికార్డు పోలింగ్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. “నేను కొన్ని నెలలుగా చెబుతున్న మాటే నిజమైంది. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని 60శాతం ప్రజలు కొత్త దిశలో నడవాలనుకుంటున్నారు. ఆ మార్పుకు జన్ సురాజ్ పార్టీనే ప్రత్యామ్నాయం అవుతోంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడినప్పుడు తమ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది” అని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం ప్రకారం.. ప్రజలు సాంప్రదాయ పార్టీలకు విసిగిపోయారు. ఎన్డీఏ, ఇండియా కూటములపై ప్రజల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఫలితాలపై ఉత్కంఠ
ఆయన వ్యాఖ్యలతోనే బీహార్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీఏ, ఇండియా కూటమి శిబిరాల్లో టెన్షన్ మొదలైంది. ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలమవుతుందనే దానిపై మేధోమథనం ప్రారంభించాయి. ఇకపోతే బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ ముగిసింది. రెండో విడతగా 122 స్థానాలకు ఓటింగ్ మంగళవారం జరగనుంది.. ఎన్నికలు ప్రశాంతంగా సాగినప్పటికీ, ఈ భారీ ఓటింగ్ శాతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు రావడం ఈసారి కీలకంగా మారింది. ఛత్ పండుగ సమయానికే ఎన్నికలు రావడంతో ప్రజల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కుటుంబాల సమేతంగా బూత్‌లకు వచ్చి ఓటు వేశారు. అయితే ఈ పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చని టాక్ వినిపిస్తోంది. కాగా, ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో కొత్త ఆకర్షణగా మారింది. మరి ఈ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉందో ఫలితాల రోజు తెలుస్తుంది.


