పండుగ మాటున బెల్లం, పటిక అమ్మకాలు
గుడుంబా తయారీకి తరలుతున్న బెల్లం
జాతర ముసుగులో అక్రమ అమ్మకాల జోరు
అటకెక్కిన అధికారుల పర్యవేక్షణ
నర్సంపేటలో బట్టబయలైన నిర్లక్ష్యం
కాకతీయ, నర్సంపేట : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అనాదిగా తెల్ల బెల్లం (బంగారం)ను మొక్కులుగా సమర్పించే ఆచారం కొనసాగుతోంది. ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా టన్నుల కొద్దీ బెల్లం అమ్మవార్లకు సమర్పిస్తారు. అయితే ఇదే అదునుగా కొందరు వ్యాపారులు దేవుడి పేరుతో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అక్రమంగా విక్రయిస్తూ అదనపు ఆదాయానికి తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం నల్ల బెల్లాన్ని నిషేధించినప్పటికీ, గుడుంబా తయారీ దారులు తెల్ల బెల్లంతోనే మద్యం తయారుచేస్తున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. నర్సంపేట పట్టణ పరిధిలోని పలు కిరాణా దుకాణాలు ‘దేవుడి పేరిట అమ్మకం’ అంటూ పట్టపగలే బెల్లం స్పటికాన్ని విక్రయిస్తున్నాయని తెలుస్తోంది. దీనిపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా అటకెక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల మాటలు.. నీటిమీద రాతలు..
అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడం తప్ప, క్షేత్రస్థాయిలో అమలు శూన్యంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉందని, మాటలకే పరిమితమై చేతల్లో చర్యలు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. పర్యవేక్షణ పూర్తిగా నీరుకారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సంపేట పట్టణంలో బెల్లం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతుండటం అధికారుల పనితీరుపై పెద్ద ప్రశ్నలు లేపుతోంది. షాపు యాజమాన్యాలు–అధికారుల మధ్య ఏవైనా అఘోర ఒప్పందాలు జరిగాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘బంగారం’ పేరిట గుడుంబా తయారీకి ఉపయోగించే పదార్థాల విక్రయం జోరుగా సాగుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.
బెల్లం అమ్మకాల్లో నర్సంపేట టాప్!
సమ్మక్క–సారలమ్మ జాతర ముసుగులో పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు అధిక మొత్తంలో గుడుంబా తయారీకి అవసరమైన పదార్థాలు విక్రయిస్తూ నర్సంపేటను టాప్‌లో నిలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెక్కర, ఈస్ట్ ఫౌండ్రీల నుంచి వచ్చే పట్టికలు కూడా బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. జాతర ముసుగులో అక్రమంగా బెల్లం పట్టపగలే విక్రయిస్తున్న దుకాణాలను నియంత్రించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం రోజువారీ పర్యవేక్షణ కూడా భారంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


