మహా జాతరకు వేళాయే
వెలుగులీనుతున్న వేములవాడ
మహాశివరాత్రికి ముస్తాబైన రాజన్న క్షేత్రం
సుమారు 3 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి జాతర వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజుల పాటు జరిగే జాతరకు సుమారు 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు తరలివస్తారని అంచనా వేస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించబడింది.స్వామి-అమ్మవార్ల లైటింగ్ డిజైన్లతో ఆకర్షణీయమైన ఆహ్వాన తోరణాలు నిర్మించారు. ఆలయ పార్కింగ్ ప్రదేశంలో శివార్చన స్టేజ్, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

ప్రత్యేక పూజలు
మహాశివరాత్రిని పురస్కరించుకొని వేములవాడ దేవస్థాన అనుబంధ దేవస్థానం భీమేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి. మొదటి రోజు శనివారం ఉదయం 5 గంటలకు శ్రీ లక్ష్మీగణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రాతఃకాల పూజ నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 9 గంటల నుంచి లఘు దర్శనం, కోడెమొక్కుబడి కొనసాగాయి. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.30 వరకు పట్టణ ప్రజలకు సర్వదర్శనం కల్పించారు. అనంతరం 1.30 నుంచి 2.30 వరకు దాతలు, స్థానిక అధికారులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా వేకువజామున ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాలు, సుప్రభాతం నిర్వహిస్తారు.ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుంది. ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6.05 గంటలకు మహాలింగార్చన, రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. పర్వదినాన భక్తులకు లఘు దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

మీ సేవ కేంద్రాల్లో ఆర్జిత సేవ
భక్తుల సౌకర్యార్థం భీమేశ్వరాలయంలో జరిగే ఆర్జిత సేవలు, దర్శనాల వివరాలను మీసేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. స్పెషల్ కోడె మొక్కుబడి, మహా రుద్రాభిషేకం, అన్నపూజ, కళ్యాణం, కుంకుమ పూజ, పల్లకి సేవ, నవగ్రహ పూజ, ద్వాదశ జ్యోతిర్లింగ అభిషేకం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం, శ్రీఆంజనేయ స్వామి వారికి అభిషేకం వంటి పలు ఆర్జిత సేవలు వివరాలు ఉంటాయి.

భక్తులకు సమగ్ర సౌకర్యాలు
భక్తుల కోసం 2 నుంచి 2.5 లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు. భక్తుల సౌకార్యార్థం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం 6 ప్రధాన కేంద్రాలు, 30 ప్రాంతాల్లో ‘రాజన్న జల ప్రసాదం’ అందుబాటులో ఉంచారు. ట్రాలీ ఆటోల ద్వారా నీటి సరఫరా కొనసాగుతుంది. స్నానాల కోసం వందల సంఖ్యలో షవర్స్ ఏర్పాటు చేయగా, తాత్కాలిక టాయిలెట్లు కూడా నిర్మించారు. ప్రధాన పార్కింగ్ కేంద్రాలను సాయి రక్ష, ఐబీపీ గోదాం, బాలనగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు నిరంతరాయంగా ఉచిత అల్పాహారం అందిస్తున్నారు. ఏడు “మే ఐ హెల్ప్ యూ ” కేంద్రాల ద్వారా భక్తులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎల్ ఈడీ స్క్రీన్ల పర్యవేక్షణ, ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణ వంటి చర్యలు చేపట్టారు. శానిటేషన్ నిర్వహణ కోసం పట్టణాన్ని జోన్లుగా విభజించి మూడు రోజుల పాటు 24 గంటలు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రతి జోన్ కు పారిశుధ్య సిబ్బంది, ట్రాక్టర్లతో పాటు పర్యవేక్షణ అధికారిని నియమించారు.
600 ప్రత్యేక బస్సులు
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ సంస్థ మూడు రోజులపాటు 600 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నది. వరంగల్‌తోపాటు కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, నర్సంపేట, హనుమకొండ, హైదరాబాద్, సిరిసిల్ల, హుజూరాబాద్ నుంచి బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే భక్తులకు వేములవాడ ప్రధాన బస్ స్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు నిరంతరం ఉచిత మినీ బస్సులను ఏర్పాటు చేశారు.
వాట్సాప్ ద్వారా సమాచారం
వేములవాడకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు దేవస్థాన వివరాలు తెలుసుకునేలా ప్రత్యేక వాట్సప్ నంబర్, క్యూఆర్ కోడ్‌ను ఈవో రమాదేవి ప్రారంభించారు. పోస్టర్‌లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా లేదా 87369 36969 నంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని మెసేజ్ చేసినా దేవస్థానం వివరాలు కనిపించనున్నాయి. ఇందులో దర్శనం, సేవల సమయాలు, దర్శన టికెట్ కౌంటర్లు, ప్రసాదం కౌంటర్, అన్న ప్రసాదం, రవాణా సదుపాయాలు, హాస్పిటల్, దివ్యాంగుల సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్లు, కల్యాణకట్ట, సమాచార కేంద్రం, పోలీస్ స్టేషన్ వంటి 12 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఆఫీసర్లు వెల్లడించారు.
కట్టుదిట్టమైన చర్యలు
జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని సూచించారు. భీమేశ్వర ఆలయంతో పాటు బద్ది పోచమ్మ ఆలయం, నాంపెల్లి ఆలయం, అగ్రహారం ఆలయాల వద్ద కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాల గుర్తింపు, వాహన మళ్లింపులు, క్యూ లైన్ల నిర్వహణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ నిఘా వంటి చర్యలు చేపట్టారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలు, తప్పిపోయిన భక్తుల కోసం హెల్ప్‌డెస్క్‌లు, లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు సూచనలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
వసతి గదులు
భీమేశ్వర సదన్, నందీశ్వర కాంప్లెక్స్ (ఏసీ/నాన్ ఏసీ), శ్రీ లక్ష్మీగణపతి కాంప్లెక్స్, పార్వతీపురం బ్లాక్స్ తదితర వసతి గదులు భక్తుల కోసం సిద్ధం చేశారు. మహాశివరాత్రి జాతరను సురక్షితంగా, ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. భక్తులు పోలీస్, దేవస్థానం సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


