తగ్గేదేలే… తరలించుడే!
హుజురాబాద్ కేంద్రంగా జోరుగా రేషన్ బియ్యం దందా
సీజ్ అయిన మిల్లులే అక్రమ నిల్వల స్థావరాలు
పట్టుబడితే మరో మిల్లు లీజ్ – మాఫియా ప్లాన్–బీ
కింగ్‌పిన్‌గా డిఫాల్ట్ మిల్లర్ మనోహర్?
ఇప్పటికే మూడు సార్లు దొరికినా దారి మార్చుకోని వైనం
మిల్లర్ నుంచి రేషన్ దందా కింగ్ ఎదిగినట్లుగా అనుమానాలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : సన్న బియ్యం రేషన్ మాఫియా “తగ్గేదేలే” అంటూ అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. పోలీసులు, సివిల్ సప్లై, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుస దాడులు చేసి పట్టుకున్నా… కేసులు నమోదు చేసినా… అక్రమ రేషన్ బియ్యం రవాణా మాత్రం ఆగడం లేదు. “పట్టుబడటం మాకు మామూలే” అన్న ధీమాతో మాఫియా కార్యకలాపాలు సాగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హుజురాబాద్ కేంద్రంగా రేషన్ సన్న బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా చుట్టుపక్కల గ్రామాల లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి రహస్య స్థావరాలకు తరలించి భారీగా నిల్వ చేస్తున్నారు. అనంతరం అనుకూల సమయం చూసుకుని గమ్యస్థానాలకు తరలిస్తూ లక్షల రూపాయల అక్రమ వ్యాపారాన్ని నిత్యకృత్యంగా కొనసాగిస్తున్నారు.
సీజ్ అయిన మిల్లులే నిల్వ స్థావరాలు!
రేషన్ మాఫియా తాజాగా మరో కొత్త ఎత్తుగడకు తెరలేపినట్లు సమాచారం. గతంలో అక్రమాల కారణంగా సీజ్ చేసిన రైస్ మిల్లులనే ఇప్పుడు అక్రమ రేషన్ బియ్యం నిల్వల కేంద్రాలుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపాన్ని అవకాశంగా మలుచుకుని గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని తరలించి అదే మిల్లుల్లో దాచుతున్నట్లు తెలుస్తోంది. సీజ్ అయిన మిల్లులపై నిరంతర నిఘా లేకపోవడం, సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం మాఫియాకు వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టుబడితే ఇంకో మిల్లు లీజ్!
ఒక మిల్లు సీజ్ అయితే చాలు… వెంటనే మరో మిల్లును లీజ్‌కు తీసుకుని దందాను కొనసాగించేలా మాఫియా ప్లాన్–బీ అమలు చేస్తోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కేసులు నమోదైనా అదే నెట్వర్క్ కొత్త మిల్లులు, కొత్త లీజులతో తిరిగి రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకే సేకరించిన బియ్యం పేదల ప్లేట్లకు చేరకముందే మాఫియా చేతుల్లో పడుతోందన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. రేషన్ బియ్యాన్ని మిల్లర్ల సంచుల్లోకి మార్చి వే బిల్లులు సృష్టిస్తూ అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ బియ్యాన్ని సీఎంఆర్ పేరుతో ఇతర రన్నింగ్ మిల్లులకు తరలించి, అక్కడి నుంచి నేరుగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి అప్పగిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో రేషన్ డీలర్ల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కింగ్‌పిన్‌గా మనోహర్?
హుజురాబాద్‌లోని లవకుశ రైస్‌మిల్లులో అర్ధరాత్రి పోలీసుల దాడుల్లో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ ఘటనతో రేషన్ మాఫియా దందా వెనుక మనోహర్ కింగ్‌పిన్‌గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు మరింత బలపడ్డాయి. ఇదే మిల్లులో గతంలో రెండుసార్లు పట్టుబడిన వ్యక్తి .. మూడోసారి కూడా భారీగా రేషన్ నిల్వలతో దొరికిపోవడం… కేసులు నమోదవుతున్నా దందా ఆగకపోవడం గమనార్హం. దందాలో మనోహర్ కింగ్‌పిన్‌గా మారాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డిఫాల్ట్ మిల్లర్‌గా నమోదు అయినప్పటికీ రేషన్ మాఫియాను తెరవెనుక నుంచి నడిపిస్తున్న కేంద్రబిందువుగా మనోహర్ పేరు వినిపించడం గమనార్హం. సంచులపై ముద్రించిన మిల్లర్ కోడ్లు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిపై సంబంధిత అధికారులు మౌనం పాటించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
నెలల్లోనే 1,067 క్వింటాళ్లు పట్టివేత
ఉమ్మడి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదన్నది వరుస పట్టివేతలతో స్పష్టమవుతోంది. గత కొద్ది నెలల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన రేషన్ బియ్యం మొత్తం 1,067 క్వింటాళ్లకు చేరింది.
రంగారావుపల్లి, దుబ్బపల్లి, హుజూరాబాద్, కొత్తపల్లి, మంథని, తాజాగా లవకుశ రైస్‌మిల్లులో జరిగిన పట్టివేతలు ఈ దందా ఎంత విస్తృతంగా సాగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. దొరికినప్పుడు మహారాష్ట్రకు తరలింపు, లోకల్ వినియోగం అంటూ వాదనలు వినిపిస్తున్నా… వాస్తవానికి ఈ బియ్యం చుట్టుపక్కల మిల్లర్లకే చేరుతోందన్న సమాచారం వెలుగులోకి వస్తోంది.


