కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యంలేదు
దానం నాగేందర్, కడియం వస్తారని ఊహించలేదు కదా..
కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కవిత ఎపిసోడ్‌పై స్పందించారు. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారాయన. దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ పార్టీలోకి వస్తారని ఊహించలేదని.. చివరికి వారు వచ్చారు కదా అని ఉదహరించారు మల్‌రెడ్డి.
మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు మల్‌రెడ్డి రంగారెడ్డి. ఎప్పటి నుంచో మంత్రి పదవి ఆశిస్తున్నారు. హైదరాబాద్ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని పలుమార్లు బహిరంగంగానే అడుగుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం కలుగుతుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పెద్దలు ఆలోచించాలని కోరారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.
పేరు మార్పు తనకు ఇష్టం లేదు
రంగారెడ్డి జిల్లా పేరు మార్పుపైనా ఆయన స్పందించారు. పేరు మార్పు తనకు ఇష్టం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది కేవలం ఊహాగానమే అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చని.. జిల్లా స్వరూపం మాత్రం మారొద్దని ప్రభుత్వాన్ని మల్‌రెడ్డి కోరారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమ్ పెరిగిందన్నారు. భూముల రేట్లు పెరుగుతున్నాయని భూములు ఎవరూ అమ్మడం లేదన్నారు. ఫార్మాసిటీపై పోరాటం చేసినందుకే గతంలో తనను కేసీఆర్ ఓడగొట్టారని మల్‌రెడ్డి చెప్పారు. నాటి ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఫార్మాసిటీ వచ్చి ఉంటే 50 కిలోమీటర్ల మేర పొల్యూషన్ అయ్యేదని రంగారెడ్డి అన్నారు.


