కాకతీయ, గీసుగొండ : తమ ఊరి భూమి కోసం వెళ్తే కబ్జాదారులుగా ముద్ర వేయడం సిగ్గుచేటని కొనాయి మాకుల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గ్రామంలో బుధవారం వారు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గీసుగొండ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్లు 783,784లో గ్రామస్తులకు చెందిన 16.18 గుంటల భూమి ఉందని తెలిపారు. అందులో రెండు ఎకరాలు గతంలో గ్రామాభి వృద్ధి కోసం వేలంపాట ద్వారా అమ్మగా, మిగిలిన 12 ఎకరాలను అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు రికార్డులు మార్చించి కొనుగోలు చేశారని తెలిపారు.
అయితే, కొనుగోలు చేసిన భూమి కంటే ఎక్కువగా ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు. ఇటీవల సర్వే చేయించగా 784/B సర్వే నంబరులో 18 గుంటల భూమి ఆక్రమించబడి నట్లు తేలిందని తెలిపారు. ఆ భూమిని దున్నడానికి వెళ్లిన ఎనిమిది మందిపై తప్పుడు కేసులు బనాయించి, ట్రాక్టర్ డోజర్‌ను సీజ్ చేయడం అన్యాయమని వారు మండిపడ్డారు. గత పదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో భూములు కబ్జా చేసిన వారు ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని వారు విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వజ్ర రాజు, పీసాల రాజేశ్వరరావు, సిరిశే రాజు, లకిడే తిరుపతి, ఎండి రహీం, ఎండి సుకూర్, కాందారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ఆరోపణలు సరికాదు..
కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. గత పది సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేశారన్నారు. వారికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు.


