26/11కి ఆపరేషన్ సిందూర్లా బుద్ధి చెబితే బాగుండేది : ఫడణవీస్
కాకతీయ, నేషనల్ డెస్క్ : ముంబయి 26/11 దాడులకు 18 ఏళ్లు పూర్తైన వేళ, వీరమరణం పొందిన భద్రతా సిబ్బంది, నిరపరాధ పౌరులను దేశం స్మరించింది. ఈ సందర్భంగా కులాబాలో జరిగిన ‘గ్లోబల్ పీస్ ఆనర్స్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే పాల్గొన్నారు. ఫడణవీస్ మాట్లాడుతూ, 26/11 దాడి తాజ్ లేదా ట్రైడెంట్ హోటల్స్‌పై మాత్రమే కాకుండా, భారత సార్వభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న పెద్ద ఉగ్రదాడి అని చెప్పారు. ముంబయి ప్రపంచ పెట్టుబడులు, పర్యాటకానికి కేంద్రం కావడంతో ఉగ్రవాదులు నగరాన్ని టార్గెట్ చేశారని తెలిపారు. తాజ్, ట్రైడెంట్ భారత సామర్థ్యానికి ప్రతీకలు కావడంతో వాటిని లక్ష్యంగా చేసుకుని భారత్‌ను బలహీనంగా చూపాలని ఉగ్రవాదులు యత్నించారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత్ వైఖరి మారిందని, 26/11 తర్వాత కూడా అప్పటి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని పరోక్షంగా విమర్శించారు. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేక పాకిస్థాన్ ఉగ్రవాదులను ఆశ్రయిస్తోందని, కొత్త భారత్ దాడికి దాడితోనే సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. ఉగ్ర ముప్పు ఇంకా కొనసాగుతుండడంతో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని ఫడణవీస్ పిలుపునిచ్చారు. 26/11 సందర్భంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన హేమంత్ కర్కరే, తుకారామ్ ఓంబ్లే తదితర అధికారుల ధైర్యాన్ని స్మరించారు. ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ శిందే మాట్లాడుతూ, తాజ్ హోటల్ ఎదుట నిలబడితే అప్పటి అగ్ని, పేలుళ్లు, ప్రజల అరుపుల జ్ఞాపకాలు ఇప్పటికీ కలవరపెడతాయని చెప్పారు. అమర జవాన్ల త్యాగాలను స్మరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని అమృతా ఫడణవీస్ ఆధ్వర్యంలోని దివ్యజ్ ఫౌండేషన్ నిర్వహించింది.


