కాకతీయ, వరంగల్ : రాష్ట్రంలో లంబాడీ జాతి ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబూరావు లంబాడీ, కోయ గోండుల మధ్య చిచ్చుపెట్టి ఘర్షణలకు దారి తీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. దానికి నిరసనగా ఆదివారం నర్సంపేట కేంద్రంలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ ను జయప్రదం చేయండని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి తేజావత్ వాసు నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లంబాడాల ఆత్మగౌరవ సభ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడీలు, బంజారా లు, సుగాలీలు వీరు ఎస్టీలు కారు అని, తెలంగాణ హైకోర్టులో అప్పీలు వేశారు, ఆ అప్పీలును హైకోర్టు కొట్టివేసింది.
అయినా మరలా సుప్రీంకోర్టులో కేసు వేయడం, వెంటనే స్పందించిన సుప్రీంకోర్టు ఆయా తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిందన్నారు. గోండు, కోయ, లంబాడీ కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా ఎదగాలనే దురుద్దేశంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అదిలాబాద్ కాంగ్రెస్ నాయకుడు సోయం బాబురావు కుట్ర చేస్తున్నారని అన్నారు. వాస్తవంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 సవరణ ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 149 మే 3 1978లో భారత పార్లమెంట్లో చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా చేర్పించారు.
దీనిని రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు పనిగట్టుకుని లంబాడీ జాతి ఆత్మ గౌరవం దెబ్బతీసేలా వీళ్ళు దొంగతనంగా చేర్చబడ్డారు.. వీళ్ళు ఓబీసీలు అని తప్పుడు ప్రకటనలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తెల్లం వెంకటరావు, సోయం బాబురావు ఆరోపణలను తిప్పి కొట్టడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, సభలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం నర్సంపేటలో జాతి ఆత్మగౌరవ సభ జరుగుతుందని, ఈ సభకు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఉదయ్ సింగ్ నాయక్ పిలుపునిచ్చారు.


