కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, షేక్ బాష్ మియా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కూనంనేని పాల్గొని మాట్లాడారు.
కమ్యూనిస్టులు నిస్వార్థ పరులని, వారి జీవితం ప్రజాసేవకే అంకితం అవుతుందని చెప్పారు. సురవరం, సీతారాం ఏచూరి, గద్దర్ వంటి నాయకులు మరణించినప్పుడు ప్రజలు నీరాజనాలు పలకడం వారి నిజాయితీకి నిదర్శనమని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిజం పదాలను తొలగించే ప్రయత్నం చేస్తోందని, సీబీఐ, ఈసీలను వాడుకుని ప్రశ్నించే వారిని అణగదొక్కుతోందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఏకం కావాలని, ఎర్రజెండా మరింత ఎరుపెక్కించడమే సురవరానికి నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. 11 నుంచి 17 వరకు జరిగే తెలంగాణా సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడుతారని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ప్రజానాట్యమండలి కళాకారుల పాటలు సభలో ఉత్తేజం నింపాయి.


