“గాంధీ పేరు తొలగించడం సిగ్గుచేటు”
ఉపాధి హామీపై కేంద్రం కుట్రలు
గాంధీ ఆశయాలకు విరుద్ధంగా బీజేపీ వైఖరి
దుబ్బపల్లెలో గాంధీ చిత్రపటాలతో నిరసన
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్ : జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ రూరల్ మండలం దుబ్బపల్లెలో గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోతె ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ స్వరాజ్యం కోసం పరితపించిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా పేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం గ్రామీణ పేదల జీవనాధారంగా మారిందని తెలిపారు.
పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో చర్లభుత్కూర్ సర్పంచ్ కూర నరేష్ రెడ్డి, చామనపల్లి సర్పంచ్ బోగోని ఐలయ్య, ఫకీర్‌పేట్ సర్పంచ్ బొద్దుల విజయలక్ష్మి, లక్ష్మణ్, ఉపసర్పంచులు అలువాల శ్రీకాంత్, బరిమద్దుల మధు, నాయకులు జగ్గాని కనుకయ్య, బుర్ర గంగయ్య, దీకొండ గంగయ్య, గాదె శ్రీకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు ప్రేమలత, విజయలక్ష్మి, ప్రశాంత్, అనితతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.


