- తెలంగాణ తల్లి చేతిలోకి మళ్లీ బతుకమ్మ వచ్చే వరకు పోరాడుదాం
- అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమిద్దాం
- లండన్ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
- రేపు విదేశాల నుంచి హైదరాబాద్‌కు రాక..
కాకతీయ, నేషనల్ డెస్క్ : ఉద్యమంలో ఏనాడు జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన ఖర్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన వచ్చుడు వచ్చుడే తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసేసిండు.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిన రోజు ముందుగా రియాక్ట్ అయ్యిందే లండన్ జాగృతి వాళ్లు.. ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకొని ప్రభుత్వ చర్యను ఖండించామన్నారు.
తెలంగాణ అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే తెలంగాణ.. అందరూ పూలతో దేవుడిని పూజిస్తే మనం పూలనే దేవుడిగా పూజిస్తాం అన్నారు. లండన్ జాగృతి అధ్యక్షుడు సుమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలకు కవిత హాజరై అక్కడి మహిళలతో బతుకమ్మ ఆడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… మళ్లీ తెలంగాణ చేతిలో బతుకమ్మను పెట్టేవరకు మనందరం పట్టుదలతో పని చేయాలే.. రాష్ట్రం సాధించుకున్నా మన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడుదాం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణ ఒక ప్రాంతం మాత్రమే.. ఇప్పుడు మనది ప్రత్యేక రాష్ట్రం.. తెలంగాణ పండుగ అంటే ఇప్పుడు దేశం పండుగ.. ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలి అన్నారు.
రేపు విదేశాల నుంచి హైదరాబాద్‌కు…
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విదేశాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత మంగళవారం హైదరాబాద్ కు రానున్నారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఈనెల 25న హర్యానాలోని రోహ్తక్ లో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ గారి 112వ జయంత్యుత్సవంలో పాల్గొన్న కవిత గారు అదే రోజు ఢిల్లీ నుంచి ఖతార్ కు వెళ్లారు. ఖతార్ రాజధాని దోహా, మల్టా, లండన్ లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.


