- పురాణ నిధి యాప్, ఆపరేషన్ సిందూర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ : దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా అందించేందుకు రూపొందించిన పురాణ నిధి యాప్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. విజయ దశమి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా కరీంనగర్ లో పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, గణేశ్ నగర్ శివాలయ ప్రధాన అర్చకులు పురాణం మహేశ్వర శర్మ మౌన వ్రతం చేపట్టడం, వారి నివాసాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం సంజయ్ కుమార్ ఆనవాయితీ. మహేశ్వర శర్మ రూపొందించిన పురాణ నిధి యాప్ ను బండి సంజయ్ ఆవిష్కరించారు. పౌరాణిక శాస్త్రాలు, గాథలు సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా యాప్ లో పొందుపర్చడం గొప్ప విషయమన్నారు.
దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను సైతం ఈ యాప్ ద్వారా నివ్రుత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు. హైందవ సంస్క్రుతిని నేటి తరానికి మరింత చేరువ చేసేందుకు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, మహేశ్వర శర్మ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ మహాశక్తి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేక న్రుత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. సబ్బని లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో వెలువడిన ఆపరేషన్ సింధూర్ త్రి భాషా కవితా సంకలనాన్ని సంజయ్ కుమార్ ఆవిష్కరించి, లక్ష్మీనారాయణను అభినందించారు. కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, సామాజిక కార్యకర్త ఉప్పల రామేశం, కవి వెల్ముల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


