కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం
జీవో 252 ప్రకారం అమలు… జర్నలిస్టులకు కొత్త నిబంధనలు
ప్రింట్, టీవీ, డిజిటల్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు అవకాశం
ఫిబ్రవరి 9 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
ఈసారి 44,706 కార్డుల జారీ లక్ష్యం… పాత కార్డులు ఫిబ్రవరి 28తో గడువు ముగింపు
కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. జీవో నం.252 ప్రకారం రూపొందించిన ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025’ ఆధారంగా ఈ కార్డులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈసారి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, ఫ్రీలాన్స్ మరియు సీనియర్ జర్నలిస్టులు కూడా అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జర్నలిస్టులు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారిక పోర్టల్ ipr.telangana.gov.in ను అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి 9, 2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అక్రిడిటేషన్ ప్రక్రియను నిరంతర ప్రాతిపదికన కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
రికార్డు స్థాయిలో కార్డుల జారీ లక్ష్యం
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఉన్న సుమారు 23 వేల కార్డులతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం విశేషం. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఫిబ్రవరి 28, 2026తో ముగియనుండడంతో జర్నలిస్టులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురైతే మీడియా రిలేషన్స్ విభాగాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించాలని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలతో అక్రిడిటేషన్ వ్యవస్థలో పారదర్శకత, సమగ్రత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


