ఇంత అన్యాయమా..?
డోర్నకల్, మరిపెడ మునిసిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు సున్నా
మహబూబాబాద్‌లో 6 బీసీ స్థానాలు.. తొర్రూర్‌లో 3 బీసీ సీట్లు
మునిసిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై బీసీల్లో ఆగ్రహం
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో బీసీలకు ఒక్క సీటు కూడా రిజర్వు కాకపోవడంపై బీసీల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో మొత్తం 15 కౌన్సిలర్ స్థానాలకు గాను 4 ఎస్టీ, 3 ఎస్సీ, 4 జనరల్ మహిళ, 4 జనరల్ స్థానాలు కేటాయించారు. బీసీలకు ఒక్కటంటే ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా రిజర్వ్ కాలేదు. మరిపెడ మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ 15 కౌన్సిలర్ స్థానాలకు గాను 6 ఎస్టీ, 1 ఎస్సీ, 4 జనరల్ మహిళ, 4 జనరల్ స్థానాలు కేటాయించగా, బీసీలకు రిజర్వేషన్ లేకుండా పోయింది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 కౌన్సిలర్ స్థానాలకు గాను 7 ఎస్టీ, 5 ఎస్సీ, 10 జనరల్ మహిళ, 8 జనరల్, 6 బీసీ స్థానాలు రానున్నాయి. తొర్రూర్ మున్సిపాలిటీలో 16 కౌన్సిలర్ స్థానాలకు గాను 2 ఎస్టీ, 3 ఎస్సీ, 5 జనరల్ మహిళ, 3 జనరల్, 3 బీసీ స్థానాలు కేటాయించారు. డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో బీసీలకు ఒక్క సీటు కూడా రిజర్వ్ కాకపోవడంతో ఆయా వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ మున్సిపాలిటీల్లో బీసీ నేతలు జనరల్ స్థానాల్లోనే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.


