పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా…?
కమలాపురం గ్రామంలో చెత్త కుప్పలు.
నెలల తరబడి చెత్త సేకరణ నిలిపివేత..
అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
కాకతీయ, ములుగు ప్రతినిధి: మంగపేట మండలం కమలాపురం గ్రామంలో పరిశుభ్రత పరిస్థితి రోజు రోజుకు మరింత క్షీణిస్తోంది. గ్రామంలోని ప్రధాన వీధులు, మలిన గల్లీలు, పంచాయతీ కార్యాలయం పరిసరాలు చెత్త కుప్పలతో నిండిపోవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లాస్టిక్, గృహ వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో వాతావరణం కలుషితం అవుతుండగా, చెత్త గుట్టల్లో కోతులు, పందులు తిరగడం గ్రామపాలన దయనీయ స్థితిని బయటపెడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నెలల తరబడి చెత్త సేకరణ జరగకపోవడంతో రోడ్ల వెంట చెత్త గుట్టలుగా పేరుకుపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిల్వ మురుగుతో దోమల బెడద… వ్యాధుల భయం
చెత్త సేకరణ సరిగా జరగక పోవడం వల్ల కాల్వలు మూసుకుపోయి మురుగు నీరు నిల్వ ఉండటం గ్రామంలో దోమల పెరుగుదలకు కారణమైందని నివాసితులు చెబుతున్నారు. దుర్వాసనతో గల్లీల్లో నడవడం కష్టంగా మారిందని, చిన్న పిల్లలు, వృద్ధులు తరచూ ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని వారు వెల్లడించారు. పంచాయతీ కార్యాలయం చుట్టూ కూడా చెత్త పేరుకుపోవడం గ్రామపాలన వైఫల్యానికి నిదర్శనమని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా..? గ్రామస్థుల ప్రశ్న…
గ్రామ పరిశుభ్రత పై బాధ్యత వహించాల్సిన పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు.
ఇళ్లలోని చెత్తను వారానికి ఒకసారి అయినా సేకరించడంలేదని, గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో చెత్త రోడ్లపై పేరుకుపోతుందంటున్నారు. గ్రామ సమస్యలు,మురుగు, మానసునీరు, వీధిలైట్లు ఏ అంశంపై కూడా స్పందించకపోవడంతో “కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా..?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పంచాయతీ కార్యాలయం చుట్టూ చెత్త గుట్టలే కనిపిస్తున్నా కార్యదర్శికి కనబడకపోవడం బాధాకరమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
23 మంది మల్టీ పర్పస్ వర్కర్లు… అయినా పరిశుభ్రత నామమాత్రం..
కమలాపురం గ్రామపంచాయతీలో 23 మంది మల్టీ పర్పస్ వర్కర్లు ఉన్నప్పటికీ గ్రామంలో ఎక్కడా శుభ్రత కనిపించడం లేదని నివాసితులు విమర్శిస్తున్నారు. కాలనీల్లో చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోయిందని, నెలల తరబడి చెత్త తొలగించే దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. వర్కర్లు, అధికారులు సరిగా పని చేయకుండా వదిలేయడం వల్ల గ్రామం మొత్తం చెత్తతో నిండిపోయిందని వారు ఆరోపిస్తున్నారు.
కాకతీయలో వార్త వచ్చినా స్పందన లేనట్టా
కమలాపురం పరిశుభ్రతపై శనివారం కాకతీయ దినపత్రికలో వార్త ప్రచురితమైనప్పటికీ పంచాయతీ అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో అసహనానికి దారితీసింది.
గత రెండు రోజులుగా కూడా చెత్త తొలగించే ప్రయత్నాలు కానరాకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతుందని గ్రామస్థులు అంటున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడుతున్నా సంబంధిత శాఖలు కనీస స్పందన చూపకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత సమస్యను వెంటనే పరిష్కరించాలని, పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పారిశుధ్యం పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం- మంగపేట ఎంపీఓ శ్రీనివాస్.
మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో పారిశుధ్య సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే కమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి పారిశుధ్యం పై ప్రత్యేక డ్రైవ్ చేపడతాం.



