ప్రజల కోసం పోరాడితే కేసులా?
సీపీఎం నాయకులపై అక్రమ కేసులు అన్యాయం
ఆరు నెలలుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం పోరాటం
పేదలకు పట్టాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ఉద్యమాన్ని అణచితే మరింత ఉధృతం
జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్
కాకతీయ, తొర్రూరు : ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర అన్యాయమని గొర్రెలు–మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ గత ఆరు నెలలుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న నాయకులు బొల్లం అశోక్, ఎండీ యాకూబ్, కొమ్మనబోయిన యాకన్న తదితరులపై అక్రమ కేసులు బనాయించి 16 రోజులుగా జైల్లో నిర్బంధించడం దారుణమని అన్నారు. సమస్యను పరిష్కరించి అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉండగా, సమస్యను మరింత జఠిలం చేసి పేదలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఇళ్లను పంపిణీ చేయకుండా కాలయాపన
గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయకుండా రెండేళ్లు కాలయాపన చేసిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అదే బాటలో రెండేళ్లుగా కాలయాపన చేస్తూ పేదల ఆశలను నీరుగారుస్తోందని ఆరోపించారు. కేసులు, జైళ్లతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే అది మరింత బలపడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, ఉద్యమ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని ప్రజాసంఘాలను ఐక్యం చేసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జీఎంపీఎస్ రాష్ట్ర నాయకుడు కడెం లింగయ్య, జిల్లా అధ్యక్షుడు పయ్యావుల మల్లయ్య, ఐలయ్య, కేవీపీఎస్ నాయకులు దుర్గయ్య, బి. మమత తదితరులు పాల్గొన్నారు.


