శంకుస్థాపనలకే అభివృద్ధి పరిమితమా ?
ఏడాది దాటినా ముందుకు కదలని పనులు
నిధులున్నా మొదలుకాని నిర్మాణాలు
తూర్పు కోట ప్రజలకు తప్పని తిప్పలు
అధికార పార్టీపై ధ్వజమెత్తిన ప్రతిపక్షాల నేతలు
కాకతీయ, ఖిలావరంగల్ : 37వ డివిజన్ తూర్పు కోట పరిధిలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డాయి. ముదిరాజ్‌వాడలో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మంచినీటి పైప్‌లైన్ పనులు… యాదవవాడలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పనులకు నిధులు మంజూరైనా, పనులు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అర్భాటంగా శంకుస్థాపనలు చేసి, ఆ తర్వాత పనులను గాలికొదిలేశారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప, వాస్తవంగా జరిగిన పని ఏదీ కనిపించడం లేదన్నారు. పెండింగ్ పనుల వల్ల తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు తీవ్రమయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తూర్పు కోటలోని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, ఖిలావరంగల్ మండలం ఉపాధ్యక్షులు నాండ్రె అమర్, బీఆర్ఎస్ 37వ డివిజన్ అధ్యక్షులు సంగరబోయిన విజయ్, సంగరబోయిన ఉమేష్, వనపర్తి ధర్మరాజు, బేర వేణు, శిరబోయిన వాసుదేవ్, ఎంసీపీఐయూ నాయకులు సుంచు జగదీశ్వర్, రాయినేని ఐలయ్య, బీజేపీ నాయకులు బిల్లా కిషోర్, పెసరు కుమారస్వామి, ముడిదే రఘునాథ్, బోలుగొడ్డు అమృత్ తదితరులు పాల్గొన్నారు.


