పరవళ్లు తొక్కుతున్న సాగునీరు!
మైలారం రిజర్వాయర్ నుంచి దిగువకు విడుదల
చివరి ఆయకట్టుకూ నీరు అందిస్తామన్న అధికారులు
రైతుల్లో ఆనందోత్సాహాలు
కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో ఉన్న రిజర్వాయర్ నుంచి ఎస్సారెస్పి కెనాల్ స్టేజ్–II ద్వారా యాసంగి (రబీ) సీజన్‌కు అవసరమైన సాగునీరు విడుదల కావడంతో కాలువలు పరవళ్లు తొక్కుతున్నాయి. సాగునీరు పంట పొలాలకు చేరుతుండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. బుధవారం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు నీటిపారుదల శాఖ అధికారులు డీఈ కిరణ్, ఏఈ బాలదాసు కాంగ్రెస్ నాయకులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కాలువల ద్వారా నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో పరిసర గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా డీఈ కిరణ్ మాట్లాడుతూ రాయపర్తి మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. సకాలంలో రైతులకు జీవనాధారమైన సాగునీటిని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి అన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, మైలారం గ్రామ సర్పంచ్ చిర్రవేణు, వర్ధన్నపేట ఏఎంసీ వైస్‌చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


