సీఎం హోదాలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు
శాంతి భద్రతలకు ముప్పు : పొన్నం అనిల్ గౌడ్
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉండి రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బుధవారం కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఎం పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను కూల్చివేయాలని పిలుపునివ్వడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్కు చెందినవారా లేక ఇతర పార్టీలకు చెందినవారా అన్నది ఆయనకే తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాష్ట్రానికి దురదృష్టకరమని, రాజకీయ ద్వేషాన్ని రెచ్చగొట్టి అల్లర్లకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మీర్ షౌకత్ ఆలి, నాయకులు ఆరే రవి గౌడ్, మాజీ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షులు చుక్క శ్రీనివాస్, నగర బీఆర్ఎస్వీ అధ్యక్షులు బొంకూరి మోహన్, సోమిరెడ్డి నరేష్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, దినేష్, అన్వేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


