మేడారం జాతర పనుల్లో అవకతవకలు
తార స్థాయికి చేరిన కాంట్రాక్టర్ల దోపిడీ
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నార్థకాలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అవకతవకలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతరహ2026కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆలయ పునర్నిర్మాణానికి 251 కోట్లతోపాటు జాతర సౌకర్యాల కోసం మౌలిక వసతుల కల్పనకు మరో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేస్తోంది. అయితే ఈ భారీ వ్యయానికి విరుద్ధంగా క్షేత్రస్థాయి పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అవినీతి మబ్బులు
జాతర సమయంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు వంటి ప్రాథమిక సౌకర్యాలపై తీవ్ర అవినీతి మబ్బులు కమ్ముకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగం ద్వారా లక్షల రూపాయలు ఖర్చు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు కేవలం పైపై చూపులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జంపన్న వాగు పరిసరాల్లో ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి తొట్టెలు కొద్ది రోజుల్లోనే పగిలిపోవడం, మొబైల్ టాయిలెట్లు అమర్చకముందే విరిగిపోవడం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా కాంట్రాక్టర్ల లాభదోపిడీ, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఏర్పాట్లు జాతరకు ముందే శిథిలమవుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు.
జాతరపై నలుగురు మంత్రులు పర్యవేక్షణ..
జాతర నిర్వహణ కోసం నలుగురు మంత్రులు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనుల అమలులో అవకతవకలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జాతర సమయానికి ముందే లోపాల సవరణతో నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు, భక్తులు ప్రభుత్వాన్ని మరియు ఉన్నతాధికారులను కోరుతున్నారు. కాంట్రాక్టర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తో సంబంధిత అధికారులు చేతులు కలపడంతో పనుల నాణ్యత లోపించిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించకపోవడంతో వనదేవతల పేరుపై కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


