ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్
అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలు
రియల్ కరెన్సీ చరిత్రలోనే కనిష్ఠానికి పతనం
పోర్టుల్లోనే రూ.2,000 కోట్ల బాస్మతి నిల్వ
పంజాబ్–హర్యానా రైతులకు ధరల ముప్పు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇరాన్‌పై అమెరికా, ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో, భారత్ నుంచి జరిగే ప్రీమియం బాస్మతి బియ్యం సరఫరాకు మరోసారి అనిశ్చితి నెలకొంది. అణు, క్షిపణి కార్యక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రాంతీయ అస్థిరతకు మద్దతు ఇస్తోందన్న ఆరోపణలతో విధించిన ఆంక్షల కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా ఇరానియన్ కరెన్సీ రియల్ పతనమై, ద్రవ్యోల్బణం 40 శాతానికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.
రియల్ పతనమే ప్రధాన కారణం
ఇరాన్ రియల్ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు డాలర్‌కు సుమారు 90 వేల రియల్ ఉండగా, ప్రస్తుతం అది 1.50 లక్షలకు చేరింది. దీంతో ఆహార దిగుమతులు ఇరాన్‌కు భారంగా మారాయి. ఇంతకు ముందు ఆహార దిగుమతులకు డాలర్‌కు 28,500 రియల్ ప్రిఫరెన్షియల్ రేటుతో సబ్సిడీ ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం, తాజా సంక్షోభంతో ఆ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో భారతీయ ఎగుమతిదారులు సరుకులు పంపేందుకు వెనుకంజ వేస్తున్నారు.
పోర్టుల్లోనే బాస్మతి నిల్వ
ఈ పరిణామాల కారణంగా కనీసం రూ.2,000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం అంతర్జాతీయ పోర్టుల్లోనే నిలిచిపోయినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. గతంలో భారత్–ఇరాన్ మధ్య వాణిజ్యం బార్టర్ విధానంలో సాగింది. అయితే భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడంతో ఆ విధానం కూడా నిలిచిపోయింది. ఇరాన్ భారత బాస్మతి బియ్యానికి అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం సగటున 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని, సుమారు రూ.12,000 కోట్ల విలువకు ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో దాదాపు 40 శాతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే సరఫరా అవుతుంది.
ఎగుమతుల్లో ఇదే విధంగా అనిశ్చితి కొనసాగితే, ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైస్ మిల్లర్లతో పాటు రాబోయే రోజుల్లో రైతులకు లభించే ధరలు కూడా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జూన్ 21 తర్వాత ఇరాన్ విదేశీ దిగుమతులను నిలిపివేసి సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభిస్తుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంతో ఈ సరఫరా చక్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.


