- ఆయన భార్య ఐఏఎస్ అధికారిణి..
కాకతీయ, నేషనల్ డెస్క్ : హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ చండీగఢ్‌లోని తన నివాసంలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన రాష్ట్రంవ్యాప్తగా కలకలం రేపింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆయన భార్య కూడా ఐఏఎస్ అధికారిణి కాగా.. ప్రస్తుతం ఆమె జపాన్‌లో పర్యటిస్తున్నారు. భర్త మృతి విషయం తెలుసుకున్న ఆమె రేపు సాయంత్రం వరకు స్వస్థలానికి చేరుకోనున్నారు.
కారణాలు తెలియాల్సి ఉంది
చండీగఢ్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (SSP) కన్వర్‌దీప్ కౌర్ వివరాల ప్రకారం.. హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సెక్టార్ 11లోని తన ప్రభుత్వ నివాసంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అని పేర్కొన్నారు.


