ఐపీఓల హవా.. ₹1.76 లక్షల కోట్లు
* 103 కంపెనీల మార్కెట్ ప్రవేశం
* చరిత్రలోనే అత్యధిక నిధుల సమీకరణ
* మదుపర్ల విశ్వాసానికి బలమైన సంకేతం
* కొత్త ఏడాదికీ ఐపీఓల ఊపు
కాకతీయ, బిజినెస్ డెస్క్ : దేశీయ మూలధన మార్కెట్లో ఈ ఏడాది ఐపీఓల హవా కొనసాగింది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలి పబ్లిక్ ఆఫర్‌లు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందనను రాబట్టాయి. మొత్తం 103 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.76 లక్షల కోట్ల నిధులను సమీకరించడం విశేషం. ఈ ఏడాది ఐపీఓల మార్కెట్‌లో పెద్ద కార్పొరేట్ సంస్థలతో పాటు మధ్య, చిన్న స్థాయి కంపెనీలు కూడా చురుకుగా పాల్గొన్నాయి. మౌలిక వసతులు, ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ, టెక్నాలజీ రంగాల కంపెనీలు ఎక్కువగా మార్కెట్‌లోకి వచ్చాయి. పలు ఐపీఓలు లిస్టింగ్ రోజునే లాభాలను అందించడంతో మదుపర్ల ఆసక్తి మరింత పెరిగింది. మార్కెట్లో లిక్విడిటీ సమృద్ధిగా ఉండటం, దేశీయ రిటైల్ మదుపర్ల భాగస్వామ్యం పెరగడం, సంస్థాగత పెట్టుబడిదారుల మద్దతు లభించడం ఐపీఓల విజయానికి కీలకంగా మారిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బలమైన కార్పొరేట్ లాభాలు, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంచనాలు కూడా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించాయి.
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పటికీ దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండటం ఐపీఓ మార్కెట్‌కు తోడ్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక సంస్కరణలు, వినియోగ డిమాండ్ వంటి అంశాలు మదుపర్ల విశ్వాసాన్ని నిలబెట్టాయని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే కొత్త ఏడాదిలోనూ ఐపీఓ మార్కెట్‌లో ఇదే ఉత్సాహం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఐపీఓలకు సిద్ధమవుతుండటంతో మరో బలమైన సంవత్సరం ఉండొచ్చని భావిస్తున్నారు.


