9 నుంచి అక్రిడిటేషన్ దరఖాస్తులకు ఆహ్వానం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక కమిషనర్ ప్రియాంక
కాకతీయ, హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు మరియు వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర సమాచార–పౌర సంబంధాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక కమిషనర్ ప్రియాంక అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025 ప్రకారం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025 డిసెంబర్ 22న జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.252తో పాటు, 2026 జనవరి 24న విడుదలైన సవరణ ఉత్తర్వుల మేరకు అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి 9, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులు పూర్తిగా I&PR శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ప్రతి జిల్లాలో మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు చేసిన అనంతరం, అర్హులైన జర్నలిస్టులకు మార్గదర్శకాల ప్రకారం కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త విధానం అమలుతో అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తవుతుందని సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు.


