- అవసరమైతే వారిపైనా పోక్సో కేసు నమోదు చేయాలి
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో అటెండర్ యాకూబ్ పాషా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐదు రోజులుగా లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పోక్సో కేసు కావడంతో బాధిత విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అధికార యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. హెచ్‌ఎం, ఇతర సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు తేలితే వారిపైనా పోక్సో కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు సూచించానని తెలిపారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గంగాధర మండలంలో జరిగిన ఘటన దారుణమని, మీడియా సంయమనంతో, తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా అధికార యంత్రాంగం వారిని ధైర్యపరుస్తోందని మంత్రి తెలిపారు.
- వంగరలో విద్యార్థి ఆత్మహత్యపై స్పందించిన బండి సంజయ్
వంగర గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య దారుణమని, విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకుని తగిన విధంగా వ్యవహరించాలని సూచించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని రకాల సహాయ సహకారాలకు కేంద్రం సిద్ధంగా ఉందని సంజయ్ తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీంలను అలర్ట్ చేశామని, ఆంధ్రప్రదేశ్‌లోని 19 జిల్లాలకు అవసరమైన బృందాలను పంపించామని అన్నారు. అవసరమైతే అదనపు టీంలను కూడా పంపిమన్నారు. తెలంగాణలో పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.


