వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం
ఆధునిక మౌలిక వసతుల విస్తరణ లక్ష్యం
సుస్థిర నగర నిర్మాణానికి చర్యలు
యూజీడి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి
జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి
కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష సమావేశం
కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మహా నగర అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం అత్యంత కీలకమని నగర మేయర్ జి సుధారాణి అన్నారు. జర్మనీ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ప్రతినిధులతో మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షా సమావేశంలో మేయర్, హన్మకొండ జిల్లా కలెక్టర్/జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడి) ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను అధికారులు దృశ్యరూప ప్రదర్శన ద్వారా కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులకు వివరించారు.ఈ సందర్భంగా
మేయర్ మాట్లాడుతూ వరంగల్ నగరం కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరమని, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరాన్ని శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో వరంగల్ నగర అభివృద్ధికి అపారమైన నిధులు కేటాయిస్తూ, నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని మేయర్ పేర్కొన్నారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్టులకు రూ. 5,725.40 కోట్ల నిధులు మంజూరు చేయడం ఆయన సంకల్పానికి నిదర్శమని తెలిపారు. యూజీడి ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి అయి, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని మేయర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నగర పారిశుధ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన కేఎఫ్‌డబ్ల్యూ సహకారంతో యూజీడి ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయగలమని, వారి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం నగరాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హన్మకొండ జిల్లా కలెక్టర్/జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, యూజీడి ప్రాజెక్టు విజయవంతమైన అమలుకు శాఖల మధ్య సమన్వయం కీలకమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేఎఫ్‌డబ్ల్యూ బృందం అందించిన సూచనలు ప్రాజెక్టు నాణ్యతను మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు మాట్లాడుతూ, యూజీడి ప్రాజెక్టుపై సమగ్రంగా వివరాలు అందించారని, రాబోయే రోజుల్లో మరిన్ని సాంకేతిక అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు అందిస్తామని తెలిపారు.
అనంతరం కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధుల బృందాన్ని మేయర్ కలెక్టర్ లు శాలువాలు, పూల మొక్కలతో సత్కరించి నగర కీర్తిని చాటే కాకతీయ కళా తోరణాలతో కూడిన ప్రతిమలను బహుకరించారు. కార్యక్రమం లో కేఎఫ్ డబ్ల్యూ ప్రతినిధులు పరిమల్, రుచి, నితిన్, ఇన్చార్జి ఎస్ఈ శ్రీనివాస్ రావు, సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సిహెచ్ఓ రమేష్, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి, సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


