ఇన్సూరెన్స్ చేసి..అన్నను హత్య చేసి
టిప్పర్‌తో ఢీకొట్టి అన్నను అంతంచేసిన తమ్ముడు
ఈఎంఐలు కట్టేందుకు అన్న ప్రాణంపై 4.14 కోట్ల పన్నాగం
రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం
నమ్మకం లేక వీడియో తీసిన మరో నిందితుడు
చాకచక్యంగా 3 రోజుల్లో కేసును చేధించిన కరీంనగర్ పోలీసులు
వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : అన్నపై ఇన్సూరెన్స్ చేసి..టిప్పర్‌తో ఢీకొట్టి చంపాడు ఓ తమ్ముడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించగా.. కరీంనగర్ పోలీసుల దర్యాప్తుతో దారుణం వెలుగులోకి వచ్చింది. టిప్పర్ వాహనాల ఈఎంఐలు కట్టలేక, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి రూ.1.50 కోట్ల అప్పులను తీర్చేందుకు ఘెరానికి ఒడిగట్టాడు. కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్‌పరిధిలో జరిగిన హత్యను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు 3 రోజుల్లోనే చాకచక్యంగా చేధించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను మంగళవారం కరీంనగర్ సీపీ గౌస్ ఆలాం మీడియాకు వెల్లడించారు. సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేష్ (30) షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి రూ.25 లక్షలు నష్టపోయాడు. అంతే కాకుండా తనకు ఉన్న టిప్పర్ లారీలు, ఈఎంఐలతో కలిపి రూ.1.50 కోట్లపైగా అప్పుల్లో చిక్కుకున్నాడు. ఈ అప్పుల నుంచి బయటపడేందుకు నరేష్ తన అన్న వెంకటేష్ (మానసిక పరిపక్వత లేని వ్యక్తి)పై రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్ చేశాడు. వెంకటేష్ పేరు పైనే రూ.20 లక్షల గోల్డ్ లోన్ తీసుకుని, ఇన్సూరెన్స్ డబ్బులు, గోల్డ్ లోన్ మాఫీ కోసం తన ఇద్దరు మిత్రులు నముండ్ల రాకేష్, డ్రైవర్ మునిగాల ప్రదీప్‌తో కలిసి అన్న హత్యకు ప్లాన్ చేశాడు. గత నెల 29 తేదీ రాత్రి టిప్పర్ డ్రైవర్ ప్రదీప్‌ను మట్టి లోడ్ తీసుకుని రావాలని చెప్పి టిప్పర్ వాహనం (టీఏస్02యూడీ6261)తో రామడుగు శివారులోని భారత్ పెట్రోల్ పంప్ వద్దకు పంపించాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం బ్రేక్‌డౌన్ అయినట్లు నటించి డ్రైవర్ ప్రదీప్ నరేష్‌కు ఫోన్ చేశాడు. నరేష్ తన అల్లుడు సాయి ద్వారా వెంకటేష్‌ను జాకీ ఇచ్చి టిప్పర్ వద్దకు జాకీ పెట్టాలనే సాకుతో పంపించాడు. వెంటనే నరేష్ కూడా అక్కడికి వచ్చి టిప్పర్ లారీ స్టార్ట్ చేసి ఉంచి, జాకీని టైర్ కింద పెట్టి తిప్పమని తన అన్న వెంకటేష్‌కు చెప్పాడు. వెంకటేష్ సెల్‌ఫోన్ లైట్ పెట్టుకుని జాకీ తిప్పుతుండగా నరేష్ స్వయంగా టిప్పర్ నడిపి జాకీ తిప్పుతున్న అన్న వెంకటేష్‌పైకి ఎక్కించాడు. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ముందు ప్లాన్ ప్రకారం డ్రైవర్ ప్రదీప్‌ను అక్కడి నుంచి పారిపోవాలని చెప్పిన నరేష్ డ్రైవర్ ప్రదీప్ ప్రమాదవశాత్తూ అన్న మీద లారీ ఎక్కించడంతో అన్న వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

అల్లుడి సాక్ష్యంతో కేసు ఛేదన
వెంకటేష్ మృతిపై నరేష్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని చెప్పగా నరేష్ అల్లుడు సాయి టిప్పర్‌ను నడిపింది నరేషేనని వెంకటేష్ తండ్రి మామిడి నర్సయ్యకు తెలిపాడు. దీంతో నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. మృతదేహ పంచనామా, స్థల పరిశీలన, సాక్ష్యాల సేకరణ అనంతరం ప్రమాద ఘటనపై అనుమానాలు కలగడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మంగళవారం ఉదయం (02-12-2025) ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ముగ్గురు నిందితులలో ఒకరైన రాకేశ్ ప్రధాన నిందితుడు నరేష్ హత్య ప్లాన్ చేస్తుండగా దానిని వీడియోగా చిత్రీకరించి తన ఫోన్‌లో భద్రపరిచినట్లు సీపీ తెలిపారు. ముగ్గురు నిందితుల నుంచి హత్య కుట్రకు సంబంధించిన వీడియో ఉన్న మొబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్ పాస్‌బుక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన ఏసీపీ విజయ్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ రాజు మరియు సిబ్బందిని సీపీ గౌస్ ఆలం అభినందించారు.


