వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్
– అసెంబ్లీలో వందేమాతరం సందర్భంగా ఎంఐఎం వాకౌట్
– లష్కరే తోయిబాకి కాంగ్రెస్ సపోర్టా?
– అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, గజ్వేల్ :అసెంబ్లీలో వందేమాతరం గేయం సందర్భంగా ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేయడంపై గజ్వేల్‌లో బిజెపి నాయకులు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహించడం దురదృష్టకరమని విమర్శించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బిజెపి అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వేల్ మండల బిజెపి అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అసెంబ్లీ సమావేశాల ఆరంభంలో భారతమాతకు వందనం చేస్తూ వందేమాతరం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేయడం దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. అలాంటి ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుని వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హిందూ సాంస్కృతిక సంప్రదాయాలపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ లష్కరే తోయిబాకి వంటి ఉగ్రవాద వర్గాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందా అనే ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడులు, గోరక్షకులపై దాడులు, హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎంఐఎం పార్టీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ వారి విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అదే ప్రజల భావాలను అవమానిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ సమాజం ఏకమై ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కుడిక్యాల రాములు, బిజెపి కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, చెప్యాల వెంకట్ రెడ్డి, నాయిని సందీప్ కుమార్, నాగు ముదిరాజ్, మన్నె శేఖర్, భినమైన ప్రభాకర్, కుమార్ గౌడ్, ఇప్ప స్వామి, బారు అరవింద్, పంజాల వెంకట్, అనిల్, తలారి రాజు, రొట్టెల దాస్, కదుల దేవేందర్, కర్ణాల శ్రీనివాస్, శ్రీరామ్ కృష్ణ, శ్రీనివాస్ చారి, ఎల్ల మధు, శాతం స్వామి, కూర స్వామి, రాజేశ్వర్ చారి, రోహిత్ నాని తదితరులు పాల్గొన్నారు.


