అల్ట్రాసౌండ్ కేంద్రాల తనిఖీ
లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కాకతీయ, కరీంనగర్: జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో బృందం కరీంనగర్ పట్టణంలోని పలు అల్ట్రాసౌండ్ కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేసింది.
పీఓడీటిటి డాక్టర్ ఉమాశ్రీ, పీఓ ఎంహెచ్‌ఎన్ డాక్టర్ సన జవేరియా ఇతర సిబ్బంది పాల్గొన్న ఈ తనిఖీల్లో రిజిస్టర్లు, రోగుల అనుమతి పత్రాలు, కేసు రికార్డులు, సంబంధిత పత్రాలు, ఫామ్-ఎఫ్ పత్రాలను పరిశీలించారు. గర్భస్థపూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ (లింగ ఎంపిక నిషేధ) చట్టం ప్రకారం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీల సందర్భంగా గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు తదితర అర్హత కలిగిన నిపుణుల అసలు అర్హత సర్టిఫికెట్లు, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ పత్రాలను ధృవీకరించారు. ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని ఉల్లంఘించే వారు శిక్షార్హులవుతారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో సయ్యద్ సాబీర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


