సైదాపూర్, కేశపట్నం పీహెచ్సీల తనిఖీ
రికార్డులు, మందుల నిల్వలపై డీఎంహెచ్ఓ సమీక్ష
కాకతీయ, కరీంనగర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు, పీఓ ఎన్సీడీ డాక్టర్ ఉమాశ్రీలతో కలిసి సైదాపూర్, కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లు, అవుట్‌పేషెంట్ రిజిస్టర్లు తదితర రికార్డులను పరిశీలించి ధృవీకరించారు. ఎన్సీడీ క్లినిక్‌లో అసంక్రామిత వ్యాధిగ్రస్తుల వివరాల నమోదు, వారికి మందులు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీ స్టోర్స్‌లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను తనిఖీ చేశారు.
పిల్లల వ్యాధి నిరోధక టీకాల నిల్వ కోసం వినియోగిస్తున్న ఐఎల్ఆర్‌ను పరిశీలించి, రోజువారీ ఉష్ణోగ్రత రికార్డులను తనిఖీ చేశారు. ఐఈసీ బోర్డుపై ప్రదర్శించిన అధిక రక్తపోటు, షుగర్ వ్యాధులకు సంబంధించిన అవగాహన సమాచారాన్ని పరిశీలించారు.
చికిత్స కోసం వచ్చిన అవుట్‌పేషెంట్లను పలకరిస్తూ, అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘ఆరోగ్య మహిళ’ హెల్త్ క్యాంపులలో మహిళల రీ-స్క్రీనింగ్‌ను 100 శాతం పూర్తి చేసి, ఫాలోఅప్ తప్పనిసరిగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రసూతి గదుల పరిశుభ్రతను పరిశీలించి, అందులో ఉండాల్సిన అత్యవసర మందుల లభ్యతను తనిఖీ చేశారు. అలాగే పీహెచ్సీల్లో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచే దిశగా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ తనిఖీల్లో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందు, పీఓ ఎన్సీడీ డాక్టర్ ఉమాశ్రీ, సైదాపూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మీనాక్షి, కేశపట్నం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్‌తో పాటు సంబంధిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



