నిద్రలేమి పెరుగుతోంది.. సరైన అలవాట్లే పరిష్కారం
రోజురోజుకీ జీవనశైలి మార్పులతో నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయి. పని ఒత్తిడి, మొబైల్ వినియోగం, అనియంత్రిత ఆహారపు అలవాట్లు గాఢనిద్రకు అడ్డంకిగా మారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
నిపుణుల సూచనల ప్రకారం, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే శరీర గడియారం క్రమబద్ధంగా పనిచేస్తుంది. పడుకునే ముందు కనీసం గంట సమయం మొబైల్ ఫోన్లు, లాప్టాప్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటి వెలుతురు నిద్రకు సహాయపడే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని చెబుతున్నారు. పడకగది ప్రశాంతంగా, చీకటిగా, చల్లగా ఉండేలా చూసుకోవడం అవసరం. గది లోపల అధిక శబ్దం లేకుండా చూసుకోవాలి. రాత్రిపూట భోజనం తేలికగా ఉండాలి. పడుకునే రెండు నుంచి మూడు గంటల ముందే భోజనం పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం తర్వాత కాఫీ, టీ వంటి పానీయాలను తగ్గించడం మంచిదని చెబుతున్నారు.పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల శరీరం సడలిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పది నిమిషాల పాటు ధ్యానం చేయడం, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వంటి సాధనలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయని పేర్కొంటున్నారు. మొబైల్ చూడటానికి బదులుగా పుస్తకం చదవడం మంచిదని సూచిస్తున్నారు. పగటిపూట తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రాత్రికి శరీరం అలసిపోయి నిద్ర సులభంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు చేయరాదని హెచ్చరిస్తున్నారు.ఈ సూచనలు పాటించినా వారం రోజులకంటే ఎక్కువగా నిద్రలేమి కొనసాగితే, అది ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య సమస్యల సూచన కావచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాంటి సందర్భాల్లో నిపుణులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.


