గొర్రె తలతో వినూత్న నిరసన
కేసీఆర్‌కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఆగ్రహం
బొప్పాపూర్‌లో రేవంత్ దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, సిరిసిల్ల : బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై రాజకీయ వేధింపులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహారి ఆధ్వర్యంలో గొర్రె తలకాయతో రూపొందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ ఆయన తెలివిని ‘గొర్రె తెలివి’గా అభివర్ణించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని సిట్ నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణిచివేయాలన్న ప్రయత్నాలు సహించబోమని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు వంగ శివరాంరెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి, దేవ రెడ్డి, సత్యం రెడ్డి, సత్యం, ఇర్ఫాన్, అశ్వక్, నాగరాజు, ప్రసాద్, శ్రీధర్, నిరటి రాజు, చంద్ర రెడ్డి తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


