ఇన్నర్ రింగ్ రోడ్ పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ సత్య శారద ఆదేశాలు
భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
నగరాభివృద్ధికి కీలక ప్రాజెక్టు
కాకతీయ, వరంగల్ సిటీ : నగరాభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ధి పనుల పురోగతిపై జిడబ్ల్యూ ఎంసీ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఖిలా వరంగల్, ఉర్స్, ఎనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ పనుల పురోగతిని కలెక్టర్ వివరంగా సమీక్షించారు. పనుల్లో జాప్యం జరగకుండా నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం
ఈ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారి, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భూ సేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేకుండా, నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని, వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ రహదారి ద్వారా నగర విస్తరణకు, వాణిజ్య అభివృద్ధికి కూడా దోహదం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సుమా, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో విశ్వ ప్రసాద్, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


