పడమర కోట వాసులకు మౌలిక వసతులు కల్పించాలి
మంత్రి కొండా సురేఖకు వినతి
కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ పరిధిలోని పడమర కోట–కాపువాడ ప్రాంతంలో నూతనంగా విస్తరించిన నివాస స్థలాల్లో గృహ నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇల్లు పథకంకు అర్హులమని, ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. కాపువాడ క్రింది భాగంలో విస్తరించిన భూముల్లో గృహ నిర్మాణాలు ప్రారంభించాలంటే విద్యుత్ స్థంబాలు, డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు, తాగునీటి పైపు లైన్లు వంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి వినతి పత్రం అందజేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని కాపువాడ వాసులు విజ్ఞప్తి చేశారు.


