మౌలిక వసతులు కల్పించాలి
కాకతీయ,ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ మండలంలోని 37, 38 డివిజన్లలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలపై భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండల అధ్యక్షుడు తాళ్లపల్లి అర్జున్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక సమస్యలను పరిశీలించి తక్షణ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 37వ డివిజన్‌లోని ఎస్సీ కాలనీ శ్మశానవాటిక దయనీయ స్థితిలో ఉండడం ప్రధాన సమస్యగా నిలిచింది. కనీస సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్నానం చేయడానికి నీటి సౌకర్యం లేకపోవడం, స్మశానానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే మున్నూరు కాపు స్మశాన వాటికకు కూడా రోడ్డు సౌకర్యం లేకపోవడం, మధ్యకోట శివాలయం పరిసరాల్లో రోడ్లు గుంతలతో ప్రమాదకరంగా మారడం, పడమర కోటలోని చిల్డ్రన్స్ పార్క్ చెత్తతో నిండిపోవడం వంటి సమస్యలను గుర్తించారు. పార్క్ చుట్టూ చెత్త పేరుకుపోవడంతో దోమల బెడద, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందిమల్ల మహేష్ మాట్లాడుతూ, సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో కందిమల్ల మహేష్, ఎల్లబోయిన చంద్రమోహన్, గోళ్ల రాజ్ కుమార్, అంకాల జనార్ధన్, సుంకరి రాజు, మేకల రాజు, రాజేశ్వరి, స్వర్ణజ, బిల్లా కిషోర్, నందకిషోర్, బక్కి రంజిత్, ఏసిరెడ్డి రంజిత్, గట్టికోప్పుల వంశీ, కొలువుల అరుణ్, కందిమల్ల హస్తిక్, బరిగెల సందీప్ తదితరులు పాల్గొన్నారు.


