- నెల్లికుదురు మండల విద్యాశాఖ అధికారి రాందాస్
కాకతీయ, నెల్లికుదురు : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ‘యుడైస్ ప్లస్ పోర్టల్’లో పక్కాగా ఆన్లైన్ చేయాలని మండల విద్యాశాఖ అధికారి ఏ. రామదాసు అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మంగళవారం మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల ప్రధానోపాధ్యాయులకు యుడైస్ ప్లస్ పోర్టల్ పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టల్ లో పాఠశాలలలోని మౌలిక వసతులు ,కావలసిన సదుపాయాలు విద్యార్థుల వివరాలు ఉపాధ్యాయుల వివరాలను పారదర్శకంగా అప్లోడ్ చేయాలని తెలిపారు. యుడైస్ ప్లస్ పాఠశాలకు గుండెకాయ వంటిదని పాఠశాలలకు ప్రభుత్వపరంగా అన్ని సదుపాయాలుసమకూర్చబడుతాయని ఆయన స్పష్టం చేశారు. ఆన్లైన్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం రిసోర్స్ పర్సన్ నవీన్ మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ మస్కపురి సుధాకర్ లు యుడైస్ ప్లస్ లో సమాచారాన్ని అప్లోడ్ చేసే ప్రక్రియను వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జి వాణిశ్రీ, వివిధ పాఠశాలల టీచర్లు, సీఆర్పిలు ఏ భాస్కరరావు, బి కవిత, జీ కవిత తదితరులు పాల్గొన్నారు.


