ఇంద్రవెళ్లి అమరత్వం తెలంగాణకు స్ఫూర్తి
స్వరాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాలి
అందుకోసమే ప్రజల వద్దకు వస్తున్నా..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజూ జనంబాట
నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు
ఇంద్రవెల్లి స్థూపం వద్ద ఘన నివాళులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం చూడగానే… తెలంగాణ ప్రజలకు
భక్తి భావన, విప్లవ భావన, దేశభక్తి భావన కలుగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అన్యాయాన్ని చూస్తూ సహించి ఊరుకోకుండా ముందుకు నడిపించే స్ఫూర్తి మనకు కలుగుతుందన్నారు. ఇక్కడి గిరిజన బిడ్డల తిరుగుబాటు తెలంగాణ బిడ్డలందరికీ ఉగ్గుపాలతో నేర్పించాల్సిన పాఠాలు అన్నారు. ఇంద్రవెల్లి స్థూపం వద్ద నివాళులు అర్పించటం తన అదృష్టం అన్నారు. ఏ త్యాగాలు, పోరాటాలు, విప్లవాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో… స్వరాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాలన్నారు. ఏ అమరవీరుల గురించి మనం మాట్లాడుతున్నామో ఆ అమరవీరులు, గిరిజనులు, ఆదివాసీల న్యాయం జరుగుతుందా మనం ఆలోచించాలి అన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
రెండేళ్లలో పరిస్థితి దిగజారింది
గతంలో కొంతవరకు మనం న్యాయం చేసుకున్నాం. కానీ ఈ రెండేళ్లలో పరిస్థితి దిగజారింది. భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలన్నది మనందరం ఆలోచన చేసుకోవాలి. జనం బాట కార్యక్రమంలో ప్రజలతో ఈ అంశాలన్ని మాట్లాడుతూ ముందుకు కదులుతున్నాం. ఆదిలాబాద్ లో మా రెండు రోజులు పర్యటన సమస్యల సమహారంగా సాగింది. ఇన్ని సమస్యలు ఆదిలాబాద్ చూడటం బాధాకరంగా ఉంది. ఐతే మేము ప్రస్తావించిన సమస్యల్లో కొన్ని సమస్యలు తీరిన సరే మా జాగృతి జనం బాట సూపర్ సక్సెస్ అయినట్లుగా భావిస్తాం. ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నదే మా ఆలోచన. దానికి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం స్పూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా… అని కవిత అన్నారు.
రిమ్స్ హాస్పిటల్ పరిశీలన
ఆదిలాబాద్‌లోని రిమ్స్ హాస్పిటల్‌ను కవిత పరిశీలించి రోగుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో సౌకర్యాలు మెరుగ్గానే ఉన్నాయని, ఇక్కడున్న జూనియర్ డాక్టర్లు, నర్సులు పేదవాళ్ల కోసం పనిచేస్తున్నారన్నారు. పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నారని అన్నారు. జూనియర్ డాక్టర్స్ డిమాండ్లు కొన్ని ఉన్నాయని, వాటి ప్రభుత్వం తీర్చాలని కోరారు. హాస్పిటల్ లో శానిటేషన్ చాలా దారుణంగా ఉందని, ఇక్కడికి వచ్చే రోగులకు మంచి వాతావారణం కల్పించాలని వైద్యులను కోరారు. గతంలో శానిటేషన్ కోసమే ప్రత్యేక బడ్జెట్ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశారని ఆరోపించారు. జిల్లాలో కార్డియాక్ అరెస్ట్ తో చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ ను కచ్చితంగా నియమించాలని కోరారు.
ప్రభుత్వం త్వరితగతిన హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.



