ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి
నుస్తులాపూర్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలన
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహ నిర్మాణ పథకంలో భాగంగా చేపట్టిన ఇండ్ల నిర్మాణం ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పరిశీలన సందర్భంగా లబ్ధిదారులు తుమ్మనవేణ రజిత, కుంటు రాధతో కలెక్టర్ మాట్లాడి, ఇప్పటివరకు నిర్మాణానికి అయిన ఖర్చు, ప్రభుత్వ సహాయం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి పథకం పూర్తి లబ్ధి పొందాలని సూచించారు.
ఈ సందర్భంగా హౌసింగ్, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమై, లబ్ధిదారులను నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని, ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇసుక సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని ఎంపీడీవోకు సూచించారు.
మోడల్ గ్రామాలు, తొలి దశలో ఎంపికైన లబ్ధిదారుల ఇండ్లు శాతం వందకు పూర్తి అయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పరిశీలనలో గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఈ వెంకటరమణ, ఏఈ శ్రీజ, ఎంపీడీవో మల్హోత్రా, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


