కాకతీయ, ములుగు: ములుగు జిల్లా కలెక్టర్ దివాకర వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి, ఇండ్ల బిల్లులు సకాలంలో పడుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్ల దశల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ దశల వారీగా ఇండ్లు మంజూరు అవుతాయని, ఇప్పటికే ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. తరువాత కలెక్టర్ చంద్రుపట్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నియంత్రణలో ఏ ఒక్క వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఆశా కార్యకర్తలు రోజూ 20 ఇంటింటి సందర్శనలు చేసి జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి తక్షణం ఔషధాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంవో శ్రీకాంత్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాహీల్, ఆర్‌ఐ కుమారస్వామి, పిఆర్ఈఈ ప్రభాకర్, ఆరోగ్య విస్తరణ అధికారి వేణుగోపాలకృష్ణ, ఉపాధ్యాయులు, లబ్ధిదారులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


